టికెట్.. నయా రేట్..
హైదరాబాద్ సిటీ: ఆర్టీసీ బస్సు చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండోసారి పెంచిన టికెట్ ధరలు సామాన్యులకు భారమే కానున్నాయి. ప్రతీ కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున టికెట్ ధరలను పెంచుతామని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో అందుకనుగుణంగా ప్రయాణికులకు చిల్లర కష్టాలు లేకుండా అధికారులు పెంచారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రస్తుతం వివిధ స్టేజీల వద్ద వసూలు చేస్తోన్న చార్జీలకు అదనంగా రూ.5 పెంచారు. సిటీ ఆర్డీనరీ, డీలక్స్ బస్సుల్లో కనీస టికెట్ ధరలను పెంచగా, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులో కనీస టికెట్ ధరను పెంచలేదు. సిటీ ఆర్డీనరీ కనీస టికెట్ ధరను రూ.5 నుంచి రూ.10 పెంచగా, డీలక్స్ బస్సుల్లో కనీస టికెట్ ధరను రూ.10 నుంచి రూ.15 చేశారు. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కనీస టికెట్ ధర రూ.10లు మాత్రమే ఉంచి మూడు స్టేజీల తర్వాత రూ.5 లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.